"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"
దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఆశ్వియుజ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం - దధ్ధోజనం
కావలసిన పదార్ధాలు
బియ్యం - కిలో
పెరుగు - లీటర్
ఉప్పు - తగినంత
పచ్చి మిరపకాయలు - ౩
కరివేపాకు - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
ఇంగువ - కొంచెం
ఎండుమిరపకాయలు - రెండు
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొద్దిగా
ఆవాలు - రెండు స్పూన్లు
మిరియాల పొడి - చారెడు
వాము - తగినంత
నెయ్యి - ఒక స్పూను
తయారు చేసే పద్ధతి
దధ్ధోజనానికి అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. నేతిలో పైన చెప్పిన పదార్థాలు అన్ని వేసుకుని పోపు చేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత పెరుగు, ఉప్పు వేసి కలిపితే సరి దద్దోజనం రెడీ.