మహిషమస్తక నృత్త వినోదిని
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదిని
దేవి తొమ్మిది అవవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే "మహర్నవమి"గా ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చేయాలి. "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మో హిన్యైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదన చేయాలి.
నైవేద్యం - కేసరి పూర్ణాలు
కావలసిన పదార్ధాలు
మినప్పప్పు - 1 కప్పు.
బియ్యం - 2 కప్పులు.
రవ్వ - 1 కప్పు.
పంచదార - 1 కప్పు.
ఇలాచీ పొడి - 1 స్పూనుడు
నెయ్యి - 2 స్పూన్లు.
నూనె - తగినంత
తయారు చేసే పద్ధతి
బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి. మూడు గంటల తర్వాత రెండింటినీ కలిపి, చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. పిండిలాగా మెత్తగా రుబ్బాలి. గారెల పిండికంటే కొంచెం జారుగా ఉండేటట్లు చూడాలి. రుబ్బిన పిండి ఒక రాత్రంతా నానాలి.
బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో రవ్వ ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోయాలి. నీరు మరుగుతున్నప్పుడు పంచదార, ఇలాచీ పొడి వేసి కలపాలి. నీళ్ళు రెండు పొంగులు రానిచ్చి బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి. సన్నని సెగపై ఉంచి ఉడికించాలి. ఉడికిన తర్వాత దింపి చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలు చేసి పళ్ళెంలో వేయాలి.
మూకుట్లో నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉండని సిద్ధంగా ఉన్న పిండిలో ముంచి వేయాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీయాలి.