కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిశారణ్య ములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.
ఒకనాడు శౌనికాది మునులు గురుతుల్యుడగు సుతునిగాంచి" " ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును
వివరించవలసినది" అని కోరిరి. అంత నా సూతమహర్షి " ఓ మునిపుంగవు లారా!
ఒకప్పుడు యీదే కోరికను నారదుడు సృష్టి కర్తయగు బ్రహ్మను కోరుకొనగా
బ్రహ్మదేవుడు అతనికి- విష్ణుమూర్తి లక్ష్మీదేవికి,
సా౦బశివుడు పార్వతీదేవికి తెలియ చేసిన విదముగా నా గాథను వివరించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రదగానాలకింపు " డని యిట్లు చెప్పెను.
పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి " ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు"డని కోరెను.అంతట మహేశుడు
మందహాసమొనరించి " దేవి ! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరమువైపు"అని మిథిలానగరపు దిశగా చూపించెను.
అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు' డని వేడుకొనెను. అందులకు వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు" మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవ త్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.