Monday, 01.20.2025, 5:49 AM
My site

దీప్తులు చిందించే దీపావళి


దీప్తులు చిందించే దీపావళి

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి, సేతమ్మను తీసుకుని, అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం నెలకొందని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. దీపావళి రోజున కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు.దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటో చూద్దాం. పూర్వం దూర్వాసముని దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. కానీ, దేవేంద్రునికి దాని గొప్పతనం తెలీక, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు కాస్తా హారాన్ని కాళ్ళతో తోక్కేసేంది. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనమైన స్థితిలో పడ్డాడు. శ్రీహరిని ప్రార్ధించగా ''ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, భక్తిగా పూజించమని'' పరిహారం చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. దాంతో లక్ష్మీదేవి కరుణ చూపి, ఇంద్రునికి తిరిగి దేవలోక ఆధిపత్యాన్ని, సర్వ సంపదలను అనుగ్రహించింది.తనను అనుగ్రహించిన లక్ష్మీదేవిని ఉద్దేశించి, దేవేంద్రుడు ''తల్లీ, సామాన్యులు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా?” అనడిగాడు.అప్పుడు లక్ష్మీదేవి ''నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్ధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను'' అని బదులిచ్చింది. అప్పటినుంచీ దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులసికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. రెండు దీపాలకు తక్కువ లేకుండా కొందరు అనేక దీపాలతో స్వర్గాన్ని తలపించేలా అలంకరిస్తారు.ఇక సాయంత్రం అయ్యేసరికి బాణాసంచా కాల్చడం మొదలౌతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, రకరకాల టపాకాయలు కాలుస్తూ సంబరం చేసుకుంటారు.

దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.

దీపావళి సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఒకరికొకరు గ్రీటింగులు, కానుకలు ఇచ్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి పిండివంటలు తింటూ, ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు. దీపావళి హిందువుల పండుగే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఈ పండుగను వేడుక చేసుకుంటున్నారు.


 


Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
  • Create a free website
  • Online Desktop
  • Free Online Games
  • Video Tutorials
  • All HTML Tags
  • Browser Kits
  • Statistics

    Total online: 2
    Guests: 2
    Users: 0