అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.
నైవేద్యం - లడ్డూలు
కావలసిన పదార్ధాలు
శనగపిండి - 1 కప్పు
నూనె - పావుకిలో
జీడిపప్పు : 50 గ్రాములు
పంచదార - 1 కప్పు
నీళ్ళు - 1 కప్పు
తయారు చేసే పద్ధతి
శనగపిండిలో తగినన్ని నీళ్ళు కలిపి ముద్దచేసి, బూందీ తయారు చేసుకోవాలి. ఆ బూందీని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక గిన్నెలో నీళ్ళు, పంచదార కలిపి పాకం పట్టుకోవాలి. ఈ పాకంలో బూందీ పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ముద్దను బాగా కలిపి పాలతో కొంచెం తడిచేసుకుంటూ ఉండలు చేస్తే సరి..రాజరాజేశ్వరీ దేవికి నివేదించాల్సిన లడ్డూలు సిద్ధం.