ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి
ప్రముఖమైనవి. హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు
దేవ, మానవ లోకాల్లో సంక్షోభం కలిగించాడు. నరకాసురుడు వరాహస్వామి, భూదేవిల
సంతానం. నరకాసురుని విష్ణుమూర్తి చంపకూడదని, తన కొడుకు తన చేతిలోనే
మరణించాలని, ఎంత లోక కంటకుడు అయినప్పటికీ తన కొడుకు నరకాసురుని పేరు
శాశ్వతంగా నిలిచిపోవాలని వరం పొందుతుంది భూదేవి. ఆ వరాన్ని అనుసరించి,
భూదేవి, ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది.దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకాసురుని అకృత్యాలను వివరించాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ అసురుని హతమార్చేందుకు బయల్దేరాడు.ఇదంతా చూసిన సత్యభామ ఆ దుష్టున్ని తానే వధిస్తాను అంది.
శ్రీకృష్ణుడు వద్దని వారించినా ఆమె తన పట్టు విడవలేదు. గరుడ వాహనాన్ని
అధిరోహించి శ్రీకృష్ణునితో కలిసి రణరంగానికి వెళ్ళింది. చాకచక్యంగా బాణాలు
వేసి శత్రుసైన్యాన్ని మట్టి కరిపించింది. గతంలో పొందిన వరాలను అనుసరించి,
చివరికి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు నరకాసురుడు. అలాగే
నరకాసురుని వధించిన రోజు ''నరక చతుర్దశి'' అయింది. అలా నరకాసురుని పేరు
శాశ్వతంగా నిలిచిపోయింది.దేవ, మానవులను పీడించే నరకాసురుని బాధ తొలగిపోవడంతో ఆ మరుసటి
రోజు, అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి,
పరవశంగా టపాసులు కాల్చారు. అదే దీపావళి పండుగ.
దీపావళి స్పెషల్ రెసిపీలు
శనగపప్పు వడలు (Wada)
కావలసిన పదార్థాలు
పచ్చిశనగపప్పు - పావుకిలో
నూనె – అరకిలో
ఉల్లిపాయలు – 4
పచ్చిమిర్చి – 6
జీలకర్ర – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
తయారు చేసే పద్ధతి
నానబెట్టిన శనగపప్పును కడిగి ఉంచుకోవాలి. అందులోంచి ఒక గుప్పెడు పప్పు తీసి ఉంచి, మిగిలినదానికి తగినంత ఉప్పువేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన ఉంచిన శనగపప్పు, జీలకర్ర కలపాలి. బాణలిలో నూనె కాగనిచ్చి, నిమ్మకాయంత ఉండలు చేసి, పాలిథిన్ కవర్ పై వడలు వత్తి, ఎర్రగా వేయించుకోవాలి. పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేస్తే, శనగపప్పు వడలు మరింత రుచిగా ఉంటాయి. నంజుకోడానికి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి, శనగపప్పు-కొబ్బరి పచ్చడి - ఏదైనా బాగుంటుంది.
ఫేణీలు (Pheneelu)
కావలసిన పదార్థాలు
ఫేణీలు - కేజీ
చిక్కటి పాలు - ఒక లీటర్
పంచదార - అర కిలో
తయారు చేసే పద్ధతి
ఫేణీలు చేయడం నూడిల్స్ కంటే సులువు. దాదాపు రెడీమేడ్ ఫుడ్ ఐటం అని చెప్పాలి. ఇవి సేమ్యాను పోలి ఇంకా సన్నగా ఉంటాయి. స్వీట్ షాపులు, కిరాణా దుకాణాల్లో అమ్ముతారు. దీపావళి సీజన్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఫేణీలను ఒక గిన్నెలోకి తీసుకుని, తగినంత పంచదార, కొన్ని కాచిన పాలు పోసి పాలు పోసి రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు ఫేణీలు రెడీ!
కోవా కజ్జికాయ (Kova Kajjikaya)
కావలసిన పదార్థాలు
మైదాపిండి – అరకిలో
పంచదార – కిలో
పాలకోవా - పావుకిలో
జాపత్రి - 2 గ్రాములు
యాలకులు – 2 గ్రాములు
శనగపిండి – 50 గ్రాములు
వంట సోడా - పావు స్పూను
బేకింగ్ పౌడర్ – పావుస్పూను
నెయ్యి – 100 గ్రాములు
రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
తయారు చేసే పద్ధతి
ఇండియన్ స్వీట్లలో కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!