దీపాల-దీపావళి
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది.భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి
సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి,
సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.
దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ
విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి
సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో
వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు
ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును
కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని
వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.
దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని,
సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా
ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను
కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను
త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా
మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా,
విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి
ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా
ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది.అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
దీపావళి పండుగ పర్వదినానికి
రెండు రోజుల ముందు జరుపుకునే పండుగే ధన్ తెరాస్. దీనినే ధన త్రయోదశి అని
కూడా అంటారు. దీపావళి వేడుకల్లో దీనిని కూడా ఒక వేడుకగా జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో దీపావళిని ఐదురోజుల పండుగగా జరుపుకుంటారు. ధనత్రయోదశి,
నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి , యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత
మనోహరంగా వేడుక చేసుకుంటారు. 'చతుర్వర్గ చింతామణి ' గ్రంథం ప్రకారం ధన
త్రయోదశి నాడు గోత్రి రాత్ర వ్రతాన్ని జరుపుకుంటారు. ఉత్తర భారతీయులు
ధనత్రయోదశి ని చాలా విశేషంగా జరుపుకుంటారు.
దక్షిణ భారతీయులు ధనత్రయోదశి నాడు తమకు ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు.
1.సిరులిచ్చే ధన త్రయోదశి
దీపావళి అమావాస్యకు రెండు రోజుల ముందు వచ్చే పండుగ ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ఈ పర్వదినం వస్తుంది. దీనిని యమ త్రయోదశి అని కూడా అంటారు. ఉత్తరాది వారు ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు.లక్ష్మీ కాటాక్షం కోసం ధన త్రయోదశి రోజున లక్ష్మీ బొమ్మ ఉన్న బంగారాన్ని మహిళలు ఎక్కువగా కొంటుంటారు. ఇలా చేస్తే సిరిసంపదలు ఒనగూరుతాయని భక్తుల నమ్మకం. ధనత్రయోశి వెనుక ఓ పురాణ గాథ ఉంది.
హిమంతుడనే రాజుకు ఎన్నో పూజల తర్వాత కుమారుడు కలిగాడు. వరప్రసాదమయిన తన కొడుకు 16వ ఏటా పెళ్లయిన నాలుగో రోజే మరణిస్తాడని జ్యోతిష్కులు ద్వారా అతడికి తెలుస్తుంది. కొంతకాలానికి పెరిగి పెద్దవాడయిన యువరాజుకు వివాహయింది. తన భర్త ఎక్కువ రోజులు బతకడన్న విషయం యువరాజు భార్యకు తెలిసింది. శ్రీమహా విష్ణువు భక్తురాలయిన ఆమె తన భర్తకు కాపాడుకునేందుకు ఉపక్రమించింది.
పెళ్లయిన నాలుగో రోజు రాజభవనం మొత్తాన్ని శోభాయామాన దీపాలతో అలంకరించింది. యువరాజు గది ముందు మణి మాణిక్యాలు, బంగారం, వెండి, రత్నాలు రాసులుగా పోసి ఆమె విష్ణువును పూజిస్తూ భజనలు చేసింది. యువరాజు ప్రాణాలను హరించడానికి సర్పరూపంలో వచ్చిన యముడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రాజభవంతిని చూసి పగలని భ్రాంతి చెందాడట. యువరాణి ఆపించిన కీర్తనలను వింటూ మైమరిపోయాడట. ఈలోగా తెల్లవారిపోవడంతో యువరాజు ప్రాణాలు తీయకుండానే యముడు వెళ్లిపోయాడట. అందుకే ధన త్రయోదశిని యమత్రయోదశి అంటారు. ఉత్తరాది వారు ఈ రోజు నుంచే ఇంటిముందు దీపాలు పెట్టి కార్తీకమాసం అయిపోయే వరకు కొనసాగిస్తారు.
2.నరక చతుర్దశి
హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు దేవ, మానవ లోకాల్లో సంక్షోభం కలిగించాడు. నరకాసురుడు వరాహస్వామి, భూదేవిల సంతానం. నరకాసురుని విష్ణుమూర్తి చంపకూడదని, తన కొడుకు తన చేతిలోనే మరణించాలని, ఎంత లోక కంటకుడు అయినప్పటికీ తన కొడుకు నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని వరం పొందుతుంది భూదేవి. ఆ వరాన్ని అనుసరించి, భూదేవి, ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది.దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకాసురుని అకృత్యాలను వివరించాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ అసురుని హతమార్చేందుకు బయల్దేరాడు.ఇదంతా చూసిన సత్యభామ ఆ దుష్టున్ని తానే వధిస్తాను అంది. శ్రీకృష్ణుడు వద్దని వారించినా ఆమె తన పట్టు విడవలేదు. గరుడ వాహనాన్ని అధిరోహించి శ్రీకృష్ణునితో కలిసి రణరంగానికి వెళ్ళింది. చాకచక్యంగా బాణాలు వేసి శత్రుసైన్యాన్ని మట్టి కరిపించింది. గతంలో పొందిన వరాలను అనుసరించి, చివరికి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు నరకాసురుడు. అలాగే నరకాసురుని వధించిన రోజు ''నరక చతుర్దశి'' అయింది. అలా నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.దేవ, మానవులను పీడించే నరకాసురుని బాధ తొలగిపోవడంతో ఆ మరుసటి రోజు, అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి, పరవశంగా టపాసులు కాల్చారు. అదే దీపావళి పండుగ.
3.దీపావళి
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్ !
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.
అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.
స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.
4.బలిపాడ్యమి
బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
5.యమద్వితీయ
భారతీయుల్లో అందులోను తెలుగు వారికి తోబుట్టువు బంధం బలంగా ఉంటుంది. తెలిగింటి ఆడపడచుకు పుట్టిళ్లు అంటే కొండంత అండ. అన్నదమ్ముళ్లంటే వల్లమాలిన అభిమానం. ఇటువంటి అభిమానానికి ప్రతీకే యమద్వితీయ పండగ. ఇది దీపావళి వెళ్లిన రెండో రోజు చేసుకుంటారు. మన తాతల కాలంలో దీనికి ప్రత్యేకతుండేది.అన్న లేదా తమ్ముడు (సోదరులు) తన ఆడపడచు ఇంటికెళ్లి సోదరి చేతి వంట తినడాన్నే 'యమద్వితీయ' అంటారు. ఈ రోజు తన తోడబుట్టిన వాడిని భోజనానికి పిలుస్తారు.
సూర్యునికీ, ఛాయాదేవికీ పుట్టిన కుమారుడు
యముడు. అతని సోదరి యమి లేదా యమున లేదా యమునానది. ఈమె తన సోదరుణ్ని ఎంతో
అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి, తన ఇంట్లో విందు చేసి
పొమ్మని ఎన్నిమార్లు కోరినా, యముడు ఏదో ఒక పనితో వ్యస్తంగా వుంటూ,
వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో, యమున, కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా
రమ్మని ఆహ్వానిస్తూ, వాగ్దానం తీసుకున్నది. దానికి యముడు, ''నన్నెవరూ
ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా
ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి'' అని నిర్ణయించుకుని, వెళ్లాడు. అలా
వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది,
స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన
యముడు, ఆమెకు వరం ఇవ్వదలచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట
విందు స్వీకరించమని కోరింది యమున. అంతే కాకుండా, తనలాగే ఏ మహిళ అయినా,
సోదరునికి ఆ రోజున విందు చేసినట్లయితే, వారికి యమబాధ లేకుండా చేయమని
కోరింది. యముడు అందుకు సమ్మతించి, ఆమెకు అనేకానేకమైన అమూల్యవస్త్రాభరణాలను
కానుక చేశాడు. ఆ రోజు నుంచీ ఈ పండుగ, 'యమద్వితీయ'గా ప్రాచుర్యంలోకి
వచ్చింది.
యముని ద్వితీయ అంటే యముని తరువాత రెండో వ్యక్తిగా
పుట్టిన సోదరి. కనుకనే ఆమె పేరిట యమద్వితీయ అయింది. సోదరి వండి వడ్డించిన
పదార్థాలను సోదరుడు భుజించటం జరుగుతుంది కనుక, దీన్ని 'భగినీహస్తభోజనం'
చేసుకునే పండుగ అని కూడా అంటారు. యముడు, యమున ఈ పండుగకు శ్రీకారం చుట్టారు
కనుక, వారిద్దరికీ పూజలు చేస్తారు. దీన్నే 'భ్రాతృద్వితీయ, భాతృదూజ్,
భయ్యాదూజ్, భాయీ దూజ్' అని కూడా పిలుచుకుంటారు.
ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట
శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన
సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు
వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ
గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న
శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం
చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమని అన్నట్లు ఆమహాలక్ష్మి
ప్రసన్నమౌతుందట!
శ్లో" చతుర్భుజాం చంద్రరూపా ఇందిరా మిందు శీతలామ్
ఆహ్లద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్
దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.